- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగు రాష్ట్రాల్లో వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడు వర్షాలు కాస్త తగ్గినా వరద ప్రభావం మాత్రం తగ్గలేదు.
పలు ప్రాంతాలు ఇంకా నీటిలో చిక్కుకుని ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతాల్లో వరద తీవ్రత చాలా ఎక్కువగా కనిపించింది.
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల వల్ల సోమవారం ఉదయానికి మొత్తం 15 మంది మరణించినట్లు అధికారిక సమాచారం. వీరిలో ఎన్టీఆర్ జిల్లాలో ఎనిమిది మంది మరణించగా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిగిలిన వారు మరణించారు.
తెలంగాణలో వరదల వల్ల ఆదివారం మధ్యాహ్నం వరకు 9 మంది మరణించినట్లు అధికారిక సమాచారం.
విజయవాడ నగరం వరుసగా రెండో రోజు కూడా నీటిలోనే ఉంది. బుడమేరు వరద ఈ నగరాన్ని అతలాకుతలం చేసింది. నగరంలోని చాలా కాలనీల్లో ఒక అడుగు నుంచి నాలుగు అడుగుల వరకు నీరు నిలిచిపోయింది.
అనేక ప్రభుత్వ శాఖలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. సింగ్ నగర్ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. పలుచోట్ల ఆహారం, ఇతర అత్యవసర పదార్థాలను బోట్లు, ట్రాక్టర్ల ద్వారా సిబ్బంది అందిస్తున్నారు.
చాలా మంది ఆ వాన నీటిలోనే నానుతూ, వరద ప్రభావం లేని ప్రాంతాల్లోని తమకు తెలిసిన వారి ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేశారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రదేశాల్లో ప్రవాహంలో ఇరుక్కున్న వారిని సహాయక బృందాలు రక్షించాయి.
కోస్తాలోని మిగిలిన జిల్లాల్లో కూడా వరద, వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపించింది. రాయలసీమలో వరద ప్రభావం కాస్త తక్కువగా ఉంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. నగరంలోని వేర్వేరు ప్రదేశాలకు పడవలో, ప్రొక్లెయినర్ మీద వెళ్లి బాధితులను పరామర్శించారు.
‘‘బుడమేరు వరద బాధితుల కష్టాలు తీరే వరకు ఇక్కడే ఉంటా. 1998 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వర్షాలు పడ్డాయి. విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.
1998లో 9.24 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఇప్పుడు 9.70 లక్షల క్యూసెక్కులు వచ్చింది. కృష్ణా బేసిన్‌లో అన్ని రిజర్వాయర్లు నిండాయి.
బుడమేరుకు వరద ఎక్కువగా రావడంతో సింగ్ నగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నంలోకి నీళ్లు వచ్చాయి. నాగార్జున సాగర్, పులిచింతల నుంచి నీరు భారీగా వస్తోంది.
దీనికి తోడు మున్నేరు, బుడమేరు నుంచి నీరు రావడంతో వరద ఎక్కువైంది. కొల్లేరుకు నీరు వెళ్లే మార్గం నిర్వహణ గత ఐదేళ్లుగా సరిగా లేకపోవడంతో విజయవాడలోకి నీళ్ల వచ్చి చేరాయి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
జల దిగ్బంధం
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. మహబూబాబాద్, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో అనేక జనావాసాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఖమ్మం నగరానికి, మహబూబాబాద్ పట్టణానికి చాలా వైపుల నుంచి రాకపోకలు ఆగిపోయాయి.
మున్నేరు వాగు వరదతో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాలు ప్రభావితం అయ్యాయి. పాలేరు దగ్గర ఒక కుటుంబం వరదలో చిక్కుకుపోయింది. యంత్రాంగం ప్రయత్నించినప్పటికీ వారిని కాపాడలేకపోయారు.
ఖమ్మం పరిధిలోని భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పంపు హౌసులు మునిగిపోయాయి. నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, కొత్తగూడెం జిల్లాలపై కూడా వరద ప్రభావం ఎక్కువగా కనిపించింది.
తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో చాలా చోట్ల వరద, వర్షం ప్రభావంతో జన జీవనానికి ఇబ్బంది కలిగింది. చాలా చోట్ల కాలనీలు, బస్తీలు, ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలు నీట మునిగాయి.
అనేక చోట్ల హాస్టళ్లు జలదిగ్బంధమైపోవడంతో, ఆ నీటిలో నుంచే విద్యార్థులు సామాన్లతో బయటకు వచ్చేశారు.
ఎక్స్‌గ్రేషియా పెంపు
తెలంగాణ ప్రభుత్వం సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. పాలేరులో వరదలో చిక్కుకున్న ఒక కుటుంబాన్ని కాపాడలేకపోయినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
అన్ని ప్రయత్నాలూ చేసినప్పటికీ వాతావరణం అనుకూలించక రక్షించుకోలేకపోయినట్టు చెప్పిన ఆయన, ఆ ఘటనను గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వర్షాలపై సమీక్ష నిర్వహించారు.
‘‘భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వ్యవస్థను సన్నద్ధంగా ఉంచుకోవాలి.
వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నాం. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలి. ఈ వరదలను జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాస్తాం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు తక్షణ సాయంగా రూ.5 కోట్ల చొప్పున ఇస్తాం’’ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
లక్షల ఎకరాల్లో పంట నష్టం
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర బృందాలకు సహాయంగా కేంద్ర బృందాలను పంపమని ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
రెండు రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరితో పాటు కూరగాయ పంటలు, అరటి వంటి పండ్ల తోటలు, ఇతర వాణిజ్య పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
200 గేదెలు కొట్టుకుపోయాయి
చెరువులు, వాగులకు గండ్లు పడిన చోట పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కట్ట తెగిన చోట ప్రవాహ ఉధృతికి భవనాలు కొట్టుకుపోయాయి.
ముందు జాగ్రత్త చర్యగా బడులకు సెలవులు ప్రకటించారు. చాలా చోట్ల ఇళ్ల డాబాలపైకి ఎక్కి కూర్చుని సమయం గడిపారు ముంపు బాధితులు.
గుంటూరు జిల్లా తుళ్లూరు దగ్గర 200 గేదెలు వరదలో కొట్టుకుపోయాయి. పలు చోట్ల లంక గ్రామాల్లో బాధితులను సహాయ సిబ్బంది కాపాడారు. కృష్ణా నదిపై ప్రకాశం బరాజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
విజయవాడలో సహాయ చర్యల్లో హెలికాప్టర్లు వాడనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
ఇవాళ, రేపు కూడా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
కొట్టుకుపోయిన రోడ్లు, ధ్వంసమైన రైల్వే ట్రాకులు
భారీ వర్షానికి రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. ముఖ్యంగా విజయవాడ, ఉత్తర దక్షిణ భారతాలను కలిపే ప్రధాన నగరం కావడంతో ఆ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.
పలుచోట్ల హైవేలపై నీరు రావడంతో ట్రాఫిక్ ఆగిపోయింది. కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. కోదాడ సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారి (హైదరాబాద్ - విజయవాడలను కలిపే హైవే) తెగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇక రైల్వే ట్రాకుపై నీరు చేరడంతో, పెద్ద ఎత్తున రైళ్ల మళ్లింపుతో పాటు కొన్ని రైళ్లు రద్దయ్యాయి.
వరంగల్ సమీపంలోని కేసముద్రం దగ్గర ట్రాక్ కింద ఉన్న నిర్మాణం మొత్తం కొట్టుకుపోయింది. అనేక చోట్ల వంతెనలపై నీరు పొంగి ప్రవహించింది.
తాళ్లు, క్రేన్లు, ప్రోక్లెయినర్ల సహాయంతో ప్రజలు, నీరున్న ప్రదేశాలను దాటాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
పలుచోట్ల రైలు ప్రయాణికులను బస్సుల్లో తరలించారు.
విజయవాడ శివార్లలో రైలు ప్రయాణికులను స్టేషన్ బయటకు తీసుకురావడం కూడా కష్టమైంది. రైళ్లు నిలిచిపోయిన చోట ఆహార పదార్థాలు అందించారు.
వందకు పైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీలూ పెద్ద ఎత్తున బస్సులను ఆపివేశాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌లో ఫాలో అవ్వండి.యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)